సరిహద్దు ఆదివాసీ గ్రామాల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
సరిహద్దు ఆదివాసీ గ్రామాల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ఆదివాసీల సమస్యలు తెలుసుకుని, విద్యా పరిస్థితులపై ఆరా – 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక
భద్రాచలం, జూన్ 20 (న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులోని మారుమూల ఆదివాసీ గ్రామాలైన పులిగుండాల, కొండివాయి, కుర్నపల్లి గ్రామాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. గ్రామాల ప్రజలతో మమేకమై వారి స్థానిక సమస్యలు, జీవన పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొండివాయి గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారిని అక్కున చేర్చుకుని పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మారుమూల గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌లపై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఆదివాసీ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల అక్రమ డిప్యుటేషన్ విధానాన్ని రద్దు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం కుర్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ఆదివాసీలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

