కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి

కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి
భద్రాచలం, మే 1 (9ఎక్స్‌ప్రెస్ న్యూస్): కార్మికుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని ఆరోపించారు. “దశాబ్దాలుగా కార్మికులు కష్టపడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను రద్దు చేయడం ద్వారా పనిభారం పెరిగింది. జీతాలు తగ్గిపోయాయి. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె చేయడానికి స్వేచ్ఛ లేకుండా చేసింది,” అని రంగారెడ్డి విమర్శించారు. కార్మికులపై ఉన్న అణచివేతను ఎదుర్కొనేందుకు ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు కెచ్చల కల్పన, డివిజన్ నాయకులు మునిగేలా శివ ప్రశాంత్, దాసరి సాయి, భాస్కర్, సుక్కన్న, సుజాత శారద, బుజ్జక్క, మహేశ్వరి, సత్యవతి చారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.