నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు | బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్

నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు

బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్

భద్రాచలం, జూన్ 20 (9 ఎక్స్‌ప్రెస్ న్యూస్): నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న ఫెర్టిలైజర్ దుకాణాలు, విత్తన కంపెనీలు, వ్యాపారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశారు.

భద్రాచలం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో “బాండు మొక్కజొన్న” పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ ఆదివాసీ రైతులను, పేద రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

చర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 21 మంది ఆదివాసీ రైతులను తప్పుడు హామీలతో ఆకర్షించి, ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి బాండు మొక్కజొన్న విత్తనాలు విక్రయించారని తెలిపారు. అయితే రైతులు భారీ పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసినప్పటికీ ఒక్క టన్ను దిగుబడి కూడా రాక తీవ్ర నష్టాలను చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు కొనసాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేకపోవడం అన్యాయమన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాల వ్యాపారులు, సంబంధిత కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బహుళజాతి కంపెనీల పేరుతో బినామీల ద్వారా నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని కోరారు.

నకిలీ విత్తనాల అమ్మకాలు కొనసాగితే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకురాలు కెచ్చల కల్పన, డివిజన్ నాయకులు దాసరి సాయన్న, మునిగేలా శివప్రశాంత్, రమక్క, వెంకటేశ్వర్లు, శాంతక్క తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *