జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్ – వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్

ఏటపాక రహదారిలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్
జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్
వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్
భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో గంటలకొలది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడ్ టిప్పర్ అదుపుతప్పి రహదారిపై గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ ట్రక్కులు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న జేకేసీ ట్రస్ట్ చైర్మన్ ఎం.డి. జమాల్ ఖాన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే జేసీబీని ఏర్పాటు చేసి గోతులను పూడ్చించి, రహదారిని సజావుగా మార్చడంతో వాహన రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ఈ సమయంలో ఎటపాక పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి, భారీ వాహనాలను అదుపులోకి తెచ్చారు.
టిప్పర్ డ్రైవర్ అనారోగ్యంతో జ్వరపెట్టుకు గురైన విషయం తెలిసిన జమాల్ ఖాన్, అతన్ని తన ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆహారం, చికిత్స అందించారు.
చర్ల వైపు నుండి ఎటపాక మండలం మీదుగా తెలంగాణకు వెళ్తున్న ఇసుక లారీల రాకపోకలు రహదారి దెబ్బతినడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రాత్రింబగళ్లు ఇసుక వాహనాల దుమ్ము, ధూళితో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
జమాల్ ఖాన్ సకాలంలో స్పందించడంతో ఈరోజు సమస్య పరిష్కారమైందని స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేకేసీ ట్రస్ట్ సభ్యులు నటరాజ్, అజీజ్, జావీద్, షాజహాన్ పాల్గొన్నారు.