ముక్కోటి పనులను విధిగా నిర్వహించాలి : ఆర్డీవో దామోదర్ రావు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయుటకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించిన ప్రకారము అధికారులందరూ తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా జనవరి ఆరవ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్నారు. ముక్కోటి మహోత్సవ పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు ఆర్డీవో పోలీస్ శాఖ సమన్వయంతో చేయడం జరుగుతుందని, లాడ్జి, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించామని అన్నారు.
ఆలయ పరిసరాల్లో సీసీటీవీ లు ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని, భద్రాచలం, దుమ్ముగూడెం లోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంస వాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈ ఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులను అనుమతించాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భద్రాచలం పట్టణంలో మరియు పర్ణశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వాణ ఎంపీడీవో తాసిల్దార్ చూసుకోవాలని, దుమ్ముగూడెంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టే విధంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి సెక్టార్‌కు ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని అన్నారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా అయ్యే విధంగా డిఇ డబ్ల్యు ఎస్, పబ్లిక్ హెల్త్ శాఖ వారు చూసుకోవాలని, భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను, ఎవరైనా భక్తులు తప్పిపోతే తెలియజేసే విధంగా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐ ఎన్ డి పి ఆర్ శాఖ వారికి ఆదేశించారు. ఆర్టీసీ తరఫున వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ తరఫున పర్ణశాల మరియు భద్రాచలంలో మొబైల్ టీమ్లు పర్యవేక్షణతో పాటు అంబులెన్సులు ఏరియా ఆసుపత్రిలో పది బెడ్లు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని డి ఎం హెచ్ ఓ కు ఆదేశించారు. ఎవరైనా భక్తులు గుండెపోటుకు గురైతే సిపిఆర్ ద్వారా శ్వాస అందించడానికి పోలీస్ మరియు గ్రామపంచాయతీ సిబ్బందికి ఈ నెల 27న ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డిఎంహెచ్ఓ కు ఆదేశించారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
తెప్పోత్సవం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలతో పాటు ఈసారి భద్రాచలం పర్యాటక కేంద్రం అభివృద్ధి పరుచుటకు గాను రాష్ట్రస్థాయి కళాకారులచే భద్రాచలం ప్రాముఖ్యత తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువులు ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఘనంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భద్రాచలం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఇప్పటికే గోడపత్రికలను పంపిణీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా భక్తులు అధిక సంఖ్యలో రావచ్చని, భద్రాచలాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరుచుటకు గాను గిరిజన మ్యూజియం మరియు దుమ్ముగూడెంలోని బొజ్జగుప్ప, నారాయణపేట గ్రామాన్ని పర్యాటకులు సందర్శించి గిరిజనుల యొక్క సాంప్రదాయం కట్టడాలు, పర్యాటకులు ఆహ్లాదకరంగా గడపడానికి వివిధ రకాల సాంప్రదాయమైన ఇండ్లు, అదేవిధంగా కిన్నెరసాని లో పుట్టి ప్రయాణం మరియు కాటేజీల నిర్మాణం పనులు జరుగుతున్నందున అందరం సమన్వయంతో కలిసి పని చేసి భక్తులు పర్యాటక స్థలాలకు వెళ్లే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏఎస్పి రవీందర్ రెడ్డి, దేవస్థానం ఈవో రమాదేవి, వివిధ శాఖల డివిజన్ అధికారులు పాల్గొన్నారు.